చంటి ఛానల్,బోధన్: స్థానిక ఆజం గంజి మార్కెట్ ఆఫీసు రోడ్డులో ఏళ్లుగా ప్రజలకు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న అక్రమ లారీ పార్కింగ్ సమస్యకు ఎట్టకేలకు చెక్ పడింది. 13వ వార్డు కౌన్సిలర్ లంక రవి చొరవతో రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది.. రహదారిని పూర్తిగా శుభ్రం చేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేశారు. ఆర్డీవో విజయకుమారి, మున్సిపల్ చైర్పర్సన్ తుము పద్మ శరత్‌రెడ్డి ఈ పనులను పర్యవేక్షించారు. ఇకపై ఇక్కడ అక్రమంగా లారీలు నిలిపితే కఠినంగా జరిమానాలు విధిస్తామని కమిషనర్ జాదవ్ హెచ్చరించారు. ఏళ్లనాటి ట్రాఫిక్ కష్టాలు తీరడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

