చంటి ఛానల్,నిజామాబాద్: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం బోధన్ పట్టణంలోని విజేత, ఉషోదయ,విద్యా వికాస్ జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలను పరిశీలించడంతో పాటు సీసీ కెమెరాల నిఘాను పర్యవేక్షించారు. గణితం-1బి, జువాలజీ, హిస్టరీ పరీక్షలకు హాజరైన విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించాలని, ముఖ్యంగా బాలికల తనిఖీ కోసం ఏఎన్ఎంల (ANM) సహకారం తీసుకోవాలని సూచించారు. నిబంధనల అమలులో లోపాలున్న కేంద్రాల అధికారులపై అసహనం వ్యక్తం చేస్తూ, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని డీఐఈఓ రవికుమార్ కు దిశానిర్దేశం చేశారు.

