చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణ శివారులోని బెల్లాల్ ప్రాంతంలో నిర్మించనున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరికీ ఒకే చోట ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, ఆధునిక వసతులు కల్పించడమే ఈ సమీకృత పాఠశాలల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పాఠశాలలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో సహా పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

