చంటి ఛానల్,బోధన్: పదవుల పంపకంలోనూ, ప్రాధాన్యత గుర్తింపులోనూ బోధన్ కాంగ్రెస్ పార్టీలో “పాత నీరు – కొత్త ఉత్సాహం” మధ్య సమన్వయం తప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీకి పట్టిన గ్రహణం వీడకముందే, గత రెండు మూడు దశాబ్దాలుగా జెండా మోసి, ఎండకు ఎండి వానకు తడిసి పార్టీని గుండెల్లో పెట్టుకున్న సీనియర్లకు ఇప్పుడు ‘గౌరవప్రదమైన మౌనం’ తప్ప వేరే బహుమతి దక్కడం లేదని రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. కింది స్థాయి ప్రజల నాడి తెలిసిన కార్యకర్తలు నేడు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక, సెకండ్ క్యాడర్ నాయకులు సైతం నిస్సహాయ స్థితిలో ఉండటం చూస్తుంటే.. “పునాదులు పటిష్టంగా ఉంటేనే భవనం నిలబడుతుంది” అనే కనీస సూత్రాన్ని అధిష్టానం విస్మరిస్తోందా అనే అనుమానం కలుగుతోంది. కార్యకర్త కన్నీరు పార్టీకి శ్రీరామరక్ష కాదని, ఇలాగే నిర్లక్ష్యం కొనసాగితే భవిష్యత్తులో పార్టీ బలం ‘కాగితాలకే’ పరిమితమయ్యే ప్రమాదం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు. అధికారం వచ్చాక ‘అనగనగా ఒక కార్యకర్త’ అనే చందంగా సీనియర్లను పక్కన పెట్టడం పార్టీ దృఢత్వానికే చేటని గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది.

