Explore

Search

November 7, 2026 6:32 pm

​”బోధన్ బల్దియాలో భగ్గుమంటున్న ‘మిత్ర’భేదం.. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య రగులుతున్న కోల్డ్ వార్!”

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పురపాలక సంఘంలో అధికార కాంగ్రెస్, మిత్రపక్షం ఎంఐఎం మధ్య పైకి స్నేహం కనిపిస్తున్నా, అంతర్గతంగా మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో రాజకీయ అగ్నిపర్వతం రగులుతోంది. మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం కాంగ్రెస్‌కు, వైస్ చైర్మన్ స్థానం ఎంఐఎంకు దక్కినా..

నిబంధనల ప్రకారం వైస్ చైర్మన్‌కు ప్రత్యేక చాంబర్ ఇవ్వలేమని కమిషనర్ తేల్చిచెప్పడం, కనీసం కౌన్సిలర్లకు కూడా కూర్చునే గది లేకపోవడం తొలి వివాదానికి బీజం వేసింది. దీనికి తోడు, ప్రజల మేలు కోసం నిర్మిస్తున్న పాఠశాల విషయంలో ఓ ఎంఐఎం కౌన్సిలర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వివాదాన్ని మరింత రాజేసి, నియోజకవర్గ కాంగ్రెస్ పెద్దల ఆగ్రహానికి కారణమై ఇరు పార్టీల మధ్య పూడ్చలేని అగాధాన్ని సృష్టించింది.

ఈ వర్గపోరు, అహంకారాల పట్టింపులు ఎంతలా దిగజారాయంటే.. కౌన్సిలర్లు తమ వార్డు సమస్యలను స్థానిక చైర్మన్ దృష్టికి తీసుకురావడానికి సంకోచిస్తూ, ఏదైనా ఉంటే నేరుగా ఎమ్మెల్యే, మంత్రి లేదా సీఎం వద్దకే తీసుకెళ్తామని భీష్మించుకు కూర్చున్నారు. “సమస్యలు నా దగ్గరికే రానప్పుడు నేనెలా న్యాయం చేయగలను?” అని చైర్మన్ నిస్సహాయత వ్యక్తం చేస్తుండటం బోధన్ పాలనా వ్యవస్థలోని డొల్లతనానికి అద్దం పడుతోంది.

ఒకవైపు నిన్నగాక మొన్న ఏర్పడిన బాన్సువాడ మున్సిపాలిటీ అభివృద్ధిలో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంటే, ఎప్పుడో ఏర్పడిన బోధన్ మాత్రం.. గతంలో మాజీ ఎమ్మెల్యే, చైర్మన్ మధ్య విభేదాలతో సగం, నేడు మిత్రపక్షాల ఆధిపత్య పోరుతో మిగతా సగం కుంటుపడి “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్న చందంగా పడకేసింది.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న సత్యాన్ని గ్రహించి.. చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు పట్టింపులు పక్కనపెట్టి సమన్వయంతో ఒకే తాటిపై నడిస్తేనే బోధన్ అభివృద్ధి చెందుతుందని, లేనిపక్షంలో తమను నమ్మి ఓటేసిన ప్రజల చేతుల్లోనే ఈ నాయకుల రాజకీయ భవిష్యత్తు రానున్న రోజుల్లో తీవ్ర ప్రశ్నార్థకంగా మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్