చంటి ఛానల్,బోధన్: సమాజ సమస్యలను వెలుగులోకి తెచ్చే పాత్రికేయులకే కష్టమొచ్చింది! నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 01వ వార్డు పరిధిలో గల జర్నలిస్టు కాలనీ వర్షపు నీటితో జలమయమై అస్తవ్యస్తంగా మారింది. సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేకపోవడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఊరి గోడును పాలకుల దృష్టికి తీసుకెళ్లే తమ కాలనీకే ఈ దుస్థితి దాపురించడం పట్ల సీనియర్ పాత్రికేయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తమ నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే స్పందించి, రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించడంతో పాటు, శాశ్వత పరిష్కారంగా పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని జర్నలిస్టులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

