చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్ యాజమాన్యం తీరు ‘తమ జేబులు నిండితే చాలు.. ట్రాఫిక్ ఏమైతే మాకేంటి?’ అన్నట్లుగా తయారైంది. నిబంధనల ప్రకారం వినియోగదారుల కోసం పార్కింగ్ సెల్లార్ ఉన్నప్పటికీ, దానిని వినియోగంలోకి తీసుకురాకుండా వాహనాలన్నింటినీ ప్రధాన రహదారిపైనే నిలిపి వేయిస్తున్నారు. దీనివల్ల కొత్త బస్టాండ్ ప్రాంతంలో నిత్యం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతూ సామాన్య ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తున్నా, అధికారులు అంటే భయం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న రిలయన్స్ నిర్వాహకుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. లాభాల వేటలో పడి సామాన్యుల సౌకర్యాన్ని తుంగలో తొక్కుతున్న ఈ ధోరణిని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే, ప్రజా ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

