చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం మంగళవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత ఖర్చులపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన మున్సిపల్ యంత్రాంగం, చివరకు తమ అసహనాన్ని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై ప్రదర్శించింది. స్వయంగా ఆహ్వానించి, తీరా సమావేశంలో ప్రశ్నలు ఎదురవుతుంటే “వీడియోలు తీయొద్దు, బయటకు వెళ్ళండి” అంటూ మున్సిపల్ కమిషనర్ మీడియాను అవమానించడం చర్చనీయాంశమైంది. కమిషనర్ తీరుపై ఎంఐఎం, బిఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా మండిపడి, మీడియాకు మద్దతుగా సభను బహిష్కరిస్తామని హెచ్చరించడంతో అధికారులు దిగిరాక తప్పలేదు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాను పిలిచి అవమానించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవ్వగా, చివరకు కమిషనర్ క్షమాపణలు చెప్పడంతో వివాదం సర్దుమణిగింది.

