చంటి ఛానల్, బోధన్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో నిజామాబాద్ జిల్లా బోధన్ పురపాలక సంఘంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం (జనవరి 28) ప్రారంభమైంది. అయితే, నామినేషన్ల స్వీకరణకు సంబంధించి మొదటి రోజున అధికారులకు ఏ అభ్యర్థి నుంచి కూడా దరఖాస్తు అందలేదు. పట్టణంలోని మొత్తం 38 వార్డులలో నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, తొలిరోజు కావడంతో అభ్యర్థులెవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. శుభ ముహూర్తాల కోసం వేచి చూడటం లేదా రాజకీయ సమీకరణాల లెక్కల్లో ఉండటంతో మొదటి రోజున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనవరి 30వ తేదీ నామినేషన్ల దాఖలుకు చివరి గడువు కావడంతో, రాబోయే రెండు రోజుల్లో అభ్యర్థుల తాకిడి పెరిగే అవకాశం ఉంది.

