చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ భీముని గుట్టపై వెలసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ 30వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ సంతోష్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య భక్తులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాట్టుకు వివిధ ద్రవ్యములతో లఘున్యాస పూర్వక రుద్రాభిషేకం, ఉత్సవ విగ్రహానికి భక్తులచే పాలాభిషేకాలు, సహస్రనామార్చన, పడిపూజ వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అనంతరం హారతి, మంత్రపుష్పం సమర్పించి, భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ వేడుకల్లో పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

