చంటి ఛానల్,బోధన్: వసంత పంచమి పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ ఏక చక్రేశ్వర శివాలయంలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో వీరశైవ ఆరాధ్య గురువులు, ధర్మ ప్రబోధకులు సంత్ శిరోమణి శ్రీ మన్మథ స్వామి 466వ జయంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటానికి డోలారోహణం, మంగళ నిరాజనాలు, అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తుల కీర్తనలు, భజనలతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, సమాజ ప్రముఖులు పురాణే అజయ్ కుమార్ మాట్లాడుతూ.. మన్మథ స్వామి బోధించిన గురు–లింగ–జంగమ సిద్ధాంతాలు, ఆయన రచించిన అభంగాలు నేటికీ సమాజానికి మార్గదర్శకాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వీరశైవ జంగమ లింగాయత సమాజ్ అధ్యక్షులు, భజన మండలి సభ్యులు నర్సింగ్ అప్ప, లక్ష్మణరావు పటేల్, శంకర్ అప్ప, యాదవ్ రావు పటేల్ మరియు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

