చంటి ఛానల్, బోధన్: “మొబైల్ ఫోన్లకు స్వస్తి పలుకుదాం.. క్రీడలకు స్వాగతం చెబుదాం” అనే నినాదంతో స్థానిక క్రెసెంట్ హై స్కూల్లో వార్షిక క్రీడా వారోత్సవాలు (Sports Week) ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు ఫోన్లకు బానిసలు కాకుండా, శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థుల కేరింతలు, కేకలతో పండుగ వాతావరణం నెలకొంది. పరుగు పందాలు, లాంగ్ జంప్, క్రికెట్మ, ఫుట్బాల్ వంటి వివిధ పోటీలలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపల్ జావేద్ మాట్లాడుతూ.. క్రీడలు కేవలం గెలుపోటముల కోసం మాత్రమే కాకుండా, విద్యార్థుల్లో జట్టు స్ఫూర్తిని, క్రమశిక్షణను మరియు నాయకత్వ లక్షణాలను పెంచుతాయని పేర్కొన్నారు. వారం రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో ప్రతి విద్యార్థి ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటాలని కోరారు.

