చంటి ఛానల్,బోధన్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటనను పురస్కరించుకుని, పోలీసులు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు ఉపేందర్, నాగుల రవిశంకర్ గౌడ్, కున్నారస్వామి, శ్రీనివాస్, రాజారాం తదితరులు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. “అధికారంలోకి రాగానే రెండు నెలల్లో ఫ్యాక్టరీ తెరిపిస్తాం, కార్మికులకు న్యాయం చేస్తాం” అని ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదని వారు ఆవేదన చెందారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కేవలం కాలయాపన కమిటీగా మారిందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు వేడుకున్నారు.

