చంటి ఛానల్,బోధన్: పట్టణంలో గత నెలలో వరుస దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను బోధన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., వెల్లడించారు. డిసెంబర్ 21న బోధన్ ఆసుపత్రి సమీపంలోని రెండు బంగారు దుకాణాల తాళాలు పగులగొట్టి 35 తులాల బంగారం, 14 కిలోల వెండిని దోచుకెళ్లిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జనవరి 11 రాత్రి ఆచన్‌పల్లి బైపాస్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన నిందితులు లక్ష్మణ్ సింగ్, ప్రేమ్ సింగ్ (మహారాష్ట్రకు చెందిన వారు)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో దొంగిలించిన సొత్తును కొనుగోలు చేసిన నయీమ్ నదీం, లక్ష్మీకాంత్ టాక్‌లను కూడా గుర్తించి, వారి నుంచి 14 తులాల బంగారం, 6 కిలోల వెండితో పాటు రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు సాగర్ సింగ్, మహమ్మద్ షేక్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితులపై గతంలో తెలంగాణ, మహారాష్ట్రల్లో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్ వెంకట నారాయణ, ఎస్.ఐ. మనోజ్ కుమార్మ, సిబ్బందిని సి.పి. ప్రత్యేకంగా అభినందించారు.

