చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్‌లోని ప్రస్తుత పాత మున్సిఫ్ కోర్టు సముదాయం స్థానంలో రెండు కోర్టుల కోసం అత్యాధునిక వసతులతో సరికొత్త భవనాన్ని నిర్మించేందుకు కసరత్తు ముమ్మరమైంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ‘జి ప్లస్ ఫైవ్’ ఫౌండేషన్‌తో, రూ.19 కోట్ల అంచనా వ్యయంతో ‘జి ప్లస్ టు’ అంతస్తుల భవన నిర్మాణానికి ఆర్అండ్బీ విభాగం రూపొందించిన లేఅవుట్, ప్రొఫార్మా అంచనాలను తెలంగాణ హైకోర్టు పరిపాలనా అనుమతి కోసం సమర్పించినట్లు నిజామాబాద్ ప్రధాన జిల్లా, సెషన్స్ జడ్జి జి.వి.ఎన్. భరత లక్ష్మి అధికారికంగా వెల్లడించారు. గతంలో బోధన్ బార్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇటీవల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావ్ దేశాయ్ సమర్పించిన తాజా వినతిపత్రాన్ని సైతం హైకోర్టు రిజిస్ట్రార్ (మౌలిక సదుపాయాలు) విభాగానికి పంపించినట్లు, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు హైకోర్టు పరిపాలనా అనుమతి ప్రక్రియలో ఉందని ఆమె స్పష్టం చేశారు.

