చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో ఆకతాయిల ఆగడాలు శృతి మించుతున్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్కు కేవలం రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాల మెట్లు ఇప్పుడు మట్కా రాయుళ్లకు అడ్డాగా మారాయి. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వీరు ఆ మెట్లపై బహిరంగంగా మట్కా ఆడుతూ, వీక్లీ మార్కెట్కు కూరగాయలు కొనేందుకు వచ్చే సామాన్యులను, బాటసారులను తీవ్రంగా వేధిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. పోలీసులంటే ఏమాత్రం భయం లేకుండా “మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు” అన్నట్లుగా వ్యవహరిస్తున్న వీరి తీరుపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి ఈ మట్కా అడ్డాను పరిశీలించి కఠిన చర్యలు తీసుకోకపోతే, చట్టం పట్ల, పోలీసుల పట్ల సమాజంలో ఉన్న నమ్మకం, భయం సన్నగిల్లుతాయని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

