చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని జేసీ పాఠశాలలో 2019 నుంచి 2025 వరకు సంబంధించిన ‘అడ్మిషన్ రిజిస్టర్’ అదృశ్యమైన వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రికార్డులు మాయమైన వెంటనే పోలీసులకు ఫిర్యాదు (FIR) చేయాల్సి ఉన్నప్పటికీ, గత 45 రోజులగా ఉపాధ్యాయులు ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతూ.. కేవలం హాజరు పట్టిక (అటెండెన్స్ రిజిస్టర్) ఆధారంగానే అడ్డగోలుగా విద్యార్థులకు టీసీలు జారీ చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు ఎవరిని రక్షించడానికి ఈ అడ్మిషన్ బుక్‌ను ఉద్దేశపూర్వకంగా మాయం చేశారని విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతుండగా.. అయితే, ఇంత బహిరంగంగా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా విద్యాశాఖ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్న విద్యార్థి లోకం, ఈ వ్యవహారంపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది.

