చంటి ఛానల్, బోధన్: రుద్రూర్ గ్రామంలో బోధన్ బార్ అసోసియేషన్ సభ్యురాలు, అడ్వకేట్ జి. కల్యాణిపై ఆదివారం సాయంత్రం జరిగిన అమానుష దాడిని నిరసిస్తూ బోధన్ బార్ అసోసియేషన్ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. ప్రెసిడెంట్ బి. రాములు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో, దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపే వరకు కోర్టు విధులను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానించారు. న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు వెంటనే ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ను అమలు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు, నిందితుల తరపున ఏ న్యాయవాది కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేయకూడదని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిరసన కాలంలో కక్షిదారులపై ఎలాంటి ప్రతికూల ఉత్తర్వులు జారీ చేయవద్దని గౌరవ న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేస్తూ, బాధితురాలికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

