చంటి ఛానల్,బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీకి ఈరోజు జరిగిన రెండో సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకోవడంతో పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది. సాయంత్రం 5 గంటల సమయానికి అందిన అధికారిక లెక్కల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 68.64 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 69,417 మంది ఓటర్లకు గాను 47,645 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో ఏర్పాటు చేసిన 111 పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు 14.24 శాతంతో మొదలైన పోలింగ్, మధ్యాహ్నం 1 గంటకు 50.69 శాతానికి చేరుకొని, చివరకు 68.64 శాతంతో ముగిసింది.

