చంటి ఛానల్,బోధన్: పట్టణంలో మున్సికల్ ఎన్నికల ప్రచారం ‘హౌరాహౌరీ’గా సాగుతోంది. వార్డుల్లో అభ్యర్థుల అడుగులు ఆగడం లేదు.. గడప గడపకూ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. అయితే, ఇక్కడే ఓటరు దేవుళ్లు తమ అసలైన ‘రాజకీయం’ చూపిస్తున్నారు. ప్రచారానికి ఎవరు వచ్చినా చిరునవ్వుతో ఆహ్వానిస్తూ, “మా ఓటు మీకేనంటూ” భరోసా ఇస్తుండటంతో అభ్యర్థులు గందరగోళంలో పడిపోతున్నారు. అందరూ ‘జై’ కొడుతుంటే అసలు తమ ఓటరు ఎవరో, గాలి ఎటు వీస్తుందో అర్థం కాక అభ్యర్థులకు చెమటలు పడుతున్నాయి. ఓటరు నాడి చిక్కక, లోలోపల టెన్షన్ పడుతూ అభ్యర్థులు అగమ్యగోచర స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

