చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బిఆర్ఎస్ పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బీగాల గణేష్ గుప్తా, వీజీ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన 420 హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను వంచించిందని మండిపడ్డారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాల వీడియోలను ప్రజలకు చూపించి, అవి అమలయ్యాయో లేదో అడిగి ఓట్లు అడగాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య సమన్వయ లోపం ఉందని, మేడారం జాతర సాక్షిగా మంత్రుల కొట్లాటలే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. రానున్న రోజుల్లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని, అప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

