చంటి ఛానల్,బోధన్: ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో చోటు చేసుకున్న మందుగుండు పేలుడు ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అడవి పందుల వేట కోసం గుర్తుతెలియని వ్యక్తులు పశుగ్రాసమైన తవుడులో పేలుడు పదార్థాలను కలిపి వదిలివేయగా, మేతకు వెళ్లిన దుపల్లి గ్రామానికి చెందిన కారె సాయికుమార్‌కు చెందిన ఆవు దానిని తిన్నది. ఆ ఆహారం నోట్లోకి వెళ్లగానే ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ఆవు నోటి భాగం ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందింది. పండుగ సమయంలో తమ జీవనాధారమైన ఆవు మృతి చెందడంతో బాధితుడు సాయికుమార్ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. గ్రామ శివారుల్లో అక్రమంగా మందుగుండు వినియోగిస్తుండటం పట్ల గ్రామస్థులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టి, బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా నిఘా పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

